ప్రసిద్ధ ఇంటర్‌నెట్‌ బ్రౌజర్లయిన క్రోమ్‌నీ ఫైర్‌ఫాక్స్‌నీ ఛాలెంజ్‌ చేస్తున్న ఓ కొత్త మాల్‌వేర్‌ బయటపడింది. కాస్పర్‌స్కీ యాంటివైరస్‌ టీమ్‌వాళ్ల పరిశోధనలో ఈ విషయం ఇటీవలే బయటికొచ్చింది. ఇంటర్‌నెట్‌ చూడాలంటే మనలో చాలామంది నిత్యం క్రోమ్‌నో ఫైర్‌ఫాక్స్‌నో ఓపెన్‌ చేస్తుంటాం. మరి ఆ మాల్‌వేర్‌ కథ ఏంటి? అది మనని కూడా ఎటాక్‌ చేయగలుగుతుందా? ఇంటర్‌నెట్‌ చూడడానికి మనం క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌, ఎడ్జ్‌, సఫారీ, ఒపెరా లాంటి బ్రౌజర్లు వాడతాం. ఈ బ్రౌజర్లలో సెక్యూరిటీ ఆప్షన్లు చాలానే ఉంటాయి. ఇంటర్‌నెట్‌లో ఎటాకర్ల బారిన పడకుండా ఉండేందుకు - ఇవి కొంత రక్షణ కల్పిస్తాయి. అంతమాత్రాన మన బ్రౌజర్లన్నీ మహా సురక్షితమైనవి అని ఎవరైనా అనుకుంటే - అంతకంటే జోక్‌ మరొకటి ఉండదు. ఎందుకంటే స్వయంగా బ్రౌజర్లే మనని నిత్యం ట్రాక్‌ చేస్తూ ఉంటాయి. బ్రౌజర్లలోని ఇంటర్నల్‌ సెక్యూరిటీ సెట్టింగ్స్‌ ... మాల్‌వేర్లనుంచి కొంతవరకూ మాత్రమే కాపాడగలుగుతాయి. అయితే నేరుగా బ్రౌజర్లని టార్గెట్‌ చేసి, సీక్రెట్‌గా తమ పని చేసుకునే మాల్‌వేర్లు ఈమధ్య పెరుగుతున్నాయి. తాజాగా క్రోమ్‌, ఫైర్‌ఫాక్స్‌ల్ని టార్గెట్‌ చేసిన ఓ మాల్‌వేర్‌ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.
ఈ మాల్‌ వేర్‌ పేరు రిడక్టర్‌. కాస్పర్‌స్కీ యాంటివైరస్‌ టీమ్‌వాళ్లు దీని ఉనికిని తొలిసారిగా కనిపెట్టారు. ఈ మాల్‌వేర్‌ ర్యాట్‌ (RAT) రకానికి చెందినది. ర్యాట్‌ అంటే అంటే రిమోట్‌ యాక్సెస్‌ ట్రోజన్‌. బ్రౌజర్లోని లోపాల్ని ఆధారం చేసుకుని, ఎటాకర్‌ దీన్ని ఏదోలా మన సిస్టమ్‌లోకి పంపిస్తాడు. ఇది మామూలు నిజాయతీ కలిగిన కోడ్‌లాగే కనిపిస్తూ సిస్టమ్‌లో ఇన్‌స్టాల్‌ అవుతుంది. ఒక్కసారి ఇది న్‌స్టాల్‌ అయ్యాక - ఇక ఎటాకర్‌ మన సిస్టమ్‌లోకి తన ఫైల్స్‌ని అప్‌లోడ్‌ చేయగలడు. మన సిస్టమ్‌నించి ఫైల్స్‌ని డౌన్‌లోడ్‌ చేసుకోగలడు. అంతే కాదు, ఫైల్స్‌ని ఎగ్జిక్యూట్‌ కూడా చేయగలడు.
అయితే ఈ రిడక్టర్‌ మాల్‌వేర్‌ని ఎటాకర్స్‌ ఏ ఉద్దేశంతో ప్రయోగించారన్నది మాత్రం సైబర్‌ నిపుణులకి అంతుబట్టలేదు. అన్నట్టు - కొంతలో కొంత నయం ఏమిటంటే - ఈ మాల్‌వేర్‌ అన్ని దేశాల్లోనూ ఎటాక్‌ చేయలేదు. కేవలం రష్యాలోనూ, తూర్పు యూరప్‌ దేశమైన బెలారస్‌లోనూ ఉన్న సిస్టమ్స్‌లో మాత్రమే ఈ రిడక్టర్‌ మాల్‌వేర్‌ ఛాయలు కనిపించాయి. సమాచార భద్రతకి సవాలు విసిరే ఈ సరికొత్త మాల్‌వేర్‌ని - ఎటాకర్లు ప్రత్యేకించి రష్యా, బెలారస్‌లలోని సిస్టమ్స్‌ పైన మాత్రమే ఎందుకు ప్రయోగించారో కూడా ఇప్పటికీ అర్థం కాని విషయంగానే మిగిలిపోయింది. ఏదేమైనా ఇలాంటి ఎటాక్స్‌ జరగకుండా ఉండాలన్నా సమాచారానికి భద్రత కావాలన్నా - మన కంప్యూటర్లోని ఆపరేటింగ్‌ సిస్టమ్‌నీ, బ్రౌజర్నీ, యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్నీ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకుంటూ ఉండడమే మన చేతిలో ఉన్న పరిష్కారం

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours