రైతుభరోసా కింద ఈ నెల 15వ తేదీన తొలివిడత నగదు జమ కానుందని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. అర్హులైన ప్రతి రైతుకు నగదు జమవుతుందన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ జిల్లాలో 5,80,132 ఖాతాలున్నాయని, వీటిల్లో అక్టోబరు 15వ తేదీన తొలి విడతలో 3,14,284 ఖాతాల్లో నగదు జమవుతుందన్నారు. పరిశీలన చేయాల్సిన ఖాతాలు 2,64,000 ఉన్నాయని ఆయన వివరించారు.
వెబ్‌ ల్యాండ్‌, ఆధార్‌ వ్యత్యాసం తదితర సమస్యలతో పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆధార్‌ను బ్యాంకు ఖాతాకు అనుసంధానం చేసుకోవాలన్నారు. ఇందుకు బ్యాంకుల చుట్టూ తిరగనక్కర్లేదని, బ్యాంకు ప్రతినిధి క్షేత్రస్థాయికి వస్తారని, వారికి వివరాలు ఇవ్వాలన్నారు. సుమారు 70 శాతం ఖాతాలకు ఆధార్‌ అనుసంధాన సమస్య ఉందన్నారు.
అదేవిధంగా ప్రజాసాధికార సర్వే కూడా సరిచేసుకోవాలన్నారు. ఇందుకు గ్రామాలకే సంబంధిత అధికారులను పంపి అక్కడికక్కడే నమోదు చేస్తామన్నారు. జిల్లాలో 45 వేల మందికి ప్రజాసాధికార సర్వే చేయాల్సి ఉందన్నారు. 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
ముటేషన్‌ సమస్యలను కూడా అధిగమించేందుకు సాగుదారుడు వీఆర్వోకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపన్ను చెల్లిస్తున్న వారికి ఈ పథకం వర్తించదన్నారు. పేదల ఇళ్లపట్టాలకు సంబంధించి 47 వేల మంది లబ్ధిదారులను గుర్తించి జాబితాను అందుబాటులో ఉంచామన్నారు. దీనిలో అభ్యంతరాలుంటే తెలియజేయాలన్నారు. ఆయనవెంట సంయుక్త కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, వ్యవసాయశాఖ జేడీ ప్రసాద్‌ తదితరులున్నారు.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours