ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా పథకానికి నిధులు విడుదలయ్యాయి. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ. 5,510 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతు నిర్దేశిత ఖాతాల్లో జమ చేస్తారు. దీంతో ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించారు. రైతు భరోసా పథకాన్ని అక్టోబర్ 15వ తేదీన నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రైతులకు భరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించనున్నారు. కాగా, రైతు భరసా పథకం కింద సుమారు 50లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.
ఇది ఇలావుంటే, మరో టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర మోడీ కూడా జగన్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. అర్హులైన రైతులకు న్యాయం చేసేలా రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలన్నారు. నిబంధనలు, కులాల పేరుతో నిరుపేద కౌలు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పక్కనపెట్టడం సరికాదని అన్నారు. కులాల పేరుతో రైతులను విడదీసిన తొలి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిదేనని చురకలంటించారు.
ధూళిపాళ్లకు వ్యవసాయ మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. అక్టోబర్ 15న రైతు సంక్షేమానికి సంబంధించి రాష్ట్రంలో చారిత్రాత్మక పథకం రైతు భరోసా అమలు కానుందని చెప్పారు. ఈ పథకంలో అర్హులైన రైతులందరికీ లబ్ధి చేకూరుతుందని అన్నారు. ఈ పథకంలో ఎలాంటి వివక్షా లేదని అన్నారు. ఎన్నికల హామీల అమలులో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని సీఎం జగన్ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. ప్రధానమంత్రి కిసాన్ యోజనతో అనుసంధానం చేసి వైఎస్సార్ రైతు భరోసా అమలు చేస్తున్నామని, ఇందులో ఎలాంటి దాపరికం లేదని వెల్లడించారు.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours