రిలయన్స్ జియో తన కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అన్ లిమిటెడ్ ఫ్రీ కాల్స్ ఎత్తివేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు చేస్తామని ప్రకటించింది. నిమిషానికి 6 పైసలు చెల్లించాలని చెప్పింది. దీని కోసం కొత్త ఐయూసీ ప్లాన్లు కూడా తీసుకొచ్చింది. ఆ ప్లాన్లు వేసుకుంటే.. ఉచితంగా డేటా ఇస్తామని రిలయన్స్ జియో ప్రకటించింది.
రిలయన్స్ జియో ప్రకటనతో కస్టమర్లు షాక్ తిన్నారు. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే ఐయూసీ చార్జీలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో ప్రకటించిన కొన్ని గంటలకే వోడాఫోన్ ఐడియా స్పందించింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేసే కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.
జియోలా తాము ఐయూసీ ఛార్జీలు వేయమని స్పష్టం చేసింది. ఐయూసీ ఛార్జీలు అనేవి మొబైల్ కంపెనీలు తమలో తాము తేల్చుకోవాల్సిన విషయమని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని ఐడియా-వోడాఫోన్ తెలిపింది.
ఐయూసీ ఛార్జీలను కవర్ చేయడానికి.. ఇతర సర్వీసు ప్రొవైడర్లకు చేసిన కాల్స్ కోసం.. వినియోగదారుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తామని టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో చేసిన ప్రకటన తొందరపాటు చర్య అని వొడాఫోన్-ఐడియా ప్రతినిధులు చెప్పారు. ఇంటర్‌ కనెక్ట్ మధ్య ఇది పరిష్కారం తీసుకురాలేదన్నారు. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్దేశించిన రెగ్యులేటరీ డెఫినిషన్ ప్రకారం ఐయూసీ ఛార్జీలు అనేది మొబైల్ ఆపరేటర్లు తేల్చుకోవాల్సిన విషయం అని, వినియోగదారులకు ఎలాంటి సంబంధం లేదని, వారు ఆందోళన చెందాల్సిన విషయం కాదని స్పష్టం చేశారు.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours