ఇతర నెట్‌వర్క్‌లకు చేసే అవుట్ గోయింగ్ కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేస్తామన్న రిలయన్స్ జియో ప్రకటనతో ప్రత్యర్థి టెలికం కంపెనీలైన భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐఎల్)లు కూడా అప్రమత్తమయ్యాయి. అవి కూడా జియో బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆఫ్-నెట్ అవుట్ గోయింగ్ కాల్స్‌పై చార్జీలు వసూలు చేయాలని యోచిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఆఫ్‌-నెట్ అవుట్‌ గోయింగ్ కాల్స్, లేదంటే బండిల్డ్ ప్యాక్ ధరలను పెంచడం ద్వారా టారిఫ్‌లు పెంచుకునేందుకు భారతీ ఎయిర్‌టెల్, వీఐఎల్‌లు ఇదొక మంచి అవకాశమని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది.
జియోకు వ్యతిరేకంగా టారిఫ్‌లను పెంచకుండా పోటీ తీవ్రతను పెంచడానికి ఎయిర్‌టెల్, వీఐఎల్‌లు ప్రయత్నించకపోవచ్చని డొలాట్ క్యాపిటల్ విశ్లేషకుడు హిమాన్షు షా పేర్కొన్నారు. 2017 డిసెంబరులో భారతీ ఎయిర్‌టెల్ ఇలానే చేస్తే ఆ తర్వాత జనవరి 2018లో జియో ధరలను బాగా తగ్గించిందని ఆయన గుర్తు చేశారు. కాబట్టి ఇప్పుడు ఎయిర్‌టెల్, వీఐఎల్‌లు కూడా ఆఫ్‌-నెట్ అవుట్ గోయింగ్ కాల్స్‌పై నిమిషానికి 6 పైసలు వసూలు చేసే అవకాశం ఉందని హిమాన్షు షా తెలిపారు. అయితే, వొడాఫోన్ ఐడియా మాత్రం అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తమ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. జియోలా ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) పేరుతో ఆఫ్-నెట్ అవుట్ గోయింగ్ కాల్స్‌కు డబ్బులు వసూలు చేయబోమని తెలిపింది.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours