మధ్యప్రదేశ్‌లోని ఓ స్మారక కేంద్రంలో మహాత్మా గాంధీ 150వ జయంతి రోజు ఆయన అస్థికల్లో కొన్నింటిని దొంగలు ఎత్తుకెళ్లారు. అక్కడున్న గాంధీ ఫొటోలపై ఆకుపచ్చ పెయింట్‌తో 'ద్రోహి' అని రాశారు.
రెవాలోని బాపూ భవన్ మెమోరియల్‌లో ఈ ఘటన జరిగింది. గాంధీ చనిపోయిన 1948 సంవత్సరం నుంచి ఈ అస్థికలు ఇందులో ఉన్నాయి.
జాతీయ సమైక్యతకు, శాంతికి భంగం కలిగించే చర్యలుగా పరిగణించి ఈ దొంగతనంపై విచారణ జరుపుతున్నామని రెవా పోలీసులు బీబీసీకి చెప్పారు.
ఈ దొంగతనం సిగ్గుచేటని బాపూ భవన్ మెమోరియల్ సంరక్షకుడైన మంగళ్‌దీప్ తివారీ విచారం వ్యక్తంచేశారు.
గాంధీ జయంతి కావడంతో బుధవారం ఉదయాన్నే భవన్ గేటు తెరిచానని ఆయన 'ద వైర్' వెబ్‌సైట్‌తో చెప్పారు. రాత్రి 11 గంటలకు తిరిగి వచ్చినప్పుడు అస్థికల దొంగతనం జరిగినట్లు గుర్తించానని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు గుర్మీత్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
గాంధీ హంతకుడైన నాథూరామ్ గాడ్సేను నమ్మేవారే చట్టవిరుద్ధమైన ఈ పని చేసి ఉంటారని గుర్మీత్ ఆరోపించారు. బాపూ భవన్లోని సీసీటీవీ కెమెరాల్లోని దృశ్యాలను పరిశీలించి, నిందితులను అరెస్టు చేయాలని రెవా పోలీసులను ఆయన కోరారు. గాంధీ అస్థికల చోరీ లాంటి ఉన్మాదపు పనులకు అడ్డుకట్ట పడాలన్నారు.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours