ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆర్కే రోజా తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. అయితే, సామాజిక సమీకరణాలతో రోజాకు జగన్ కేబినెట్‌లో పదవి దక్కలేదు. దీంతో ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యారనే ప్రచారం సైతం సాగింది. వీటికి బలం చూకూర్చేలా కేబినెట్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆమె దూరంగా ఉన్నారు. మంత్రివర్గంలో చోటు సంపాదించిన వారి పేర్లు ప్రకటించగానే ఆమె అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆమెను బుజ్జగించడానికి రంగంలోకి దిగిన అధిష్ఠానం.. నామినేటెడ్ పదవి ఇస్తామని చెప్పింది.
ఆ వెంటనే ఆమెకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. రోజాకు ఏపీఐఐసీ ఛైర్మన్‌ పదవి ఇస్తున్నట్టు చెప్పినా జులై 10 వరకు ఉత్తర్వులు జారీచేయలేదు. దీంతో ఆమె జులై 15 వరకూ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టలేదు. కొన్ని కారణాలతో.. ఉత్తర్వులు జారీలో జాప్యం జరిగిందని, అందుకే రోజా కూడా బాధ్యతలు స్వీకరించలేదని అప్పట్లో ప్రచారం జరిగింది. ఏపీఐఐసీ ఛైర్మన్‌గా ఉత్తర్వులు జారీచేసినా, ఆమె జీతభత్యాలపై అందులో పేర్కోలేదు.
తాజాగా, దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం శుక్రవారం జారీచేసింది. ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ హోదాలో ఎమ్మెల్యే రోజాకు జీతభత్యాల కింద నెలకు రూ.3.82 లక్షలు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. వేతనం కింద రూ.2 లక్షలు, వాహన సౌకర్యానికి నెలకు రూ.60 వేలు, ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం లేని పక్షంలో వసతి సౌకర్యానికి నెలకు ఇంటి అద్దె రూ.50 వేలు, మొబైల్‌ సేవలకు రూ.2 వేలు, వ్యక్తిగత సిబ్బంది జీతభత్యాల చెల్లింపునకు నెలకు రూ.70 వేలు కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది.

Share To:

John Billmoria

Post A Comment:

0 comments so far,add yours